``తండ్రి పేరుపై గల స్థలంలో కొడుకు ఇల్లు కట్టుకోవచ్చు. కానీ, హోంలోన్‌కెళితే మాత్రం తండ్రిని సహ-దరఖాస్తు దారుడిగా చేరిస్తే బ్యాంకులు అనుమతినిస్తాయి. అలాగే రుణ గ్రహీత ఆదాయం, ఇప్పటికే ఆయన రుణ వాయిదా చెల్లింపులు, లోన్ రీ పేమెంట్ హిస్టరీ చూడటంతోపాటు కీలక పత్రాలన్నీ త్వరితగతిన సబ్మిట్ చేస్తేనే గృహ రుణం మంజూరు అవుతుంది``
parent land- home loan | ప్రతి ఒక్కరికి సొంతిల్లు కావాలన్న కోరిక ఉంటుంది. తమ ఇష్టానికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవాలని తల పోస్తుంటారు. అందుకు ప్రతి కుటుంబ యజమాని తొలి నుంచి కొంత సొమ్ము పొదుపు చేస్తూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు కుటుంబ పెద్ద నిర్ణయం మేరకు ఇల్లు రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం అంతటా యూనివర్శల్ ఫ్యామిలీలే.. అయినా పిల్లలకు వారి తల్లిదండ్రులు అండదండలనిస్తారు.
తొలి నుంచి పొదుపుగా జీవించే తల్లిదండ్రులు.. తమ పిల్లల సొంతింటి కల సాకారం చేయడానికి సర్వం సిద్ధం చేస్తారు. తండ్రి పేరు మీద గల ఆ స్థలంలో ఇప్పుడు కలల సౌధం నిర్మించుకోవాలంటే మాటలా..?! కానే కాదు.. ప్రతిదీ డబ్బుతో ముడి పడి ఉంది.
ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలు, భవన నిర్మాణ కార్మికుల వేతనాలు భారీగానే పెరిగాయి. ఈ క్రమంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే బ్యాంకు రుణమే శరణ్యం.. మరి, తండ్రి పేరుపై గల భూమిలో కొడుకు సులువుగానే ఇల్లు నిర్మించుకోగలరా..?! అందుకు ఎదురయ్యే ఆటంకాలేమిటో ఓ సారి పరిశీలిద్దాం..!
రుణ గ్రహీత సిబిల్ స్కోర్ తనిఖీ ఇలా
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఇల్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి ఇబ్బడి ముబ్బడిగా రుణాలిస్తున్నాయి. అలా ఇంటి రుణాలిచ్చే బ్యాంకర్ దగ్గరికి వెళ్లి దరఖాస్తు సబ్ మిట్ చేసేస్తాం. అంతటితో ఆగిపోలేదు. హోంలోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆదాయం, కుటుంబ ఖర్చులు.. ఆయన సిబిల్ స్కోర్‌పై తనిఖీలు చేస్తాయి.
ఈఎంఐ.. లోన్ రీ పేమెంట్ మీదా నజర్
ఇప్పటికే వివిధ అవసరాల రీత్యా తీసుకున్న రుణాలపై నెలసరి వాయిదా (ఈఎంఐ)లు, రుణం రీపేమెంట్ చరిత్ర ఆధారంగా వేతన జీవులకు ఇంటి రుణం ఇవ్వాలా..?! లేదా?! అన్న నిర్ణయానికి వస్తుంది ఏ బ్యాంకైనా సరే. ఆదాయం కన్నా ఎక్కువగా ఈఎంఐలు ఉన్నా.. సొంతింటిలో జీవనం సాగించాలన్న కల సాకారం కావాలంటే సిబిల్ స్కోర్‌తోపాటు మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించకుండా ఈఎంఐ చెల్లింపులు, ఈఎంఐ చెల్లింపుల్లో గడువు మిస్ అయినటువంటి అంశాలు పెద్ద అడ్డుగోడగా నిలుస్తాయి.
తండ్రి స్థలంలో కొడుకు ఇంటికి లోన్ సంక్లిష్టం ఇలా
తండ్రి యాజమానిగా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన హోంలోన్‌కు అప్రూవల్ రావడం సంక్లిష్టంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి కూడా తన కొడుకు సొంతింటి వాడు కావాలంటే.. రుణం కోసం సహ దరఖాస్తు దారుగా కొడుకుతో కలిసి సంయుక్త ఇంటి రుణ ఒప్పందంలో చేరాల్సిన అవసరం ఉండొచ్చు. అలా కాకుండా కొడుక్కి యాజమాన్య హక్కులను బదిలీ చేసినా సదరు దరఖాస్తు దారుకు తేలిగ్గానే రుణం అప్రూవల్ అవుతుంది.
వేతనం మాత్రమే కాదు.. ఆస్తి యాజమాన్య హక్కు కీలకం
ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో వేతన జీవిగా ఉన్న వృత్తి నిపుణుడికి ఇంటి రుణం పొందడం ఈజీగా కనిపించొచ్చు. కానీ ఆ స్థలం తన రిటైర్డు తండ్రి పేరు మీద ఉన్నా, ఆస్తి యాజమాన్యం, రుణ వ్యవస్థీకరణకు అడ్డుగోడగా నిలుస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాల రీపేమంట్, ఈఎంఐ చెల్లింపుల చరిత్ర ఆధారంగానే ఇంటి రుణం మంజూరవుతుందా? లేదా? అన్న విషయం ఆధార పడి ఉంటుంది.
తండ్రి కూడా సహ- దరఖాస్తు దారుగా చేరితే తేలిక
భూమి రిజిస్ట్రేషన్ తండ్రి పేరు మీద ఉంటే.. రుణ దరఖాస్తులో దరఖాస్తు దారుడితోపాటు తండ్రిని భాగస్వామి కావాల్సిందిగా బ్యాంకర్లు కోరతారు. తద్వారా ఆస్తికి భద్రత కూడా లభిస్తుంది. తండ్రి వయస్సు కూడా రుణ చెల్లింపు గడువుకు పరిమితిగా మారుతుంది.
తండ్రి స్థలాన్ని మోర్టగేజ్ చేసుకోవాలిలా..
`హోంలోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వేతనం మాత్రమే సరిపోదు. ఇప్పటికే తీసుకున్న రుణాల ఈఎంఐలు, రీపేమెంట్ హిస్టరీతోపాటు ఆస్తిపై యాజమాన్య హక్కు తదితర అంశాలు రుణ గ్రహీత ఆదాయం కంటే ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయి. తండ్రి పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీద మోర్టగేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తన తండ్రిని రుణ దరఖాస్తులో సహ-దరఖాస్తుదారుగా చేర్చుకుంటే బేష్షుగ్గా ఉంటుంది. ఆయన వయస్సు.. రుణ చెల్లింపు గడువును నిర్దేశిస్తుంది. కనుక ఆదాయం కంటే స్థలంపై యాజమాన్య హక్కులే రుణానికి అప్రూవల్ పొందడంలో కీలకం అవుతుంది` అని బ్యాంకు బజార్ సీఈఓ అధిల్ శెట్టి తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ఇళ్లకే అత్యధిక రుణాలు
నిర్మాణంలో ఉన్న ఇంటిపైనే రుణదాతలు అత్యధికంగా రుణాలిస్తారు. ల్యాండ్ టైటిల్ హక్కుల గల తండ్రి తన కొడుకుతో కలిసి సహ దరఖాస్తుదారుగా చేరడం వల్ల ఆ భూమిని మార్టగేజ్ చేసినట్లవుతుంది. కొన్ని కుటుంబాలు భూమి బదిలీ చేయడానికి బదులు తండ్రి ప్రధాన దరఖాస్తుదారుడిగా, కొడుకును సహ దరఖాస్తు దారుగా చేర్చి ఇంటి రుణం తీసుకుంటారని అధిల్ శెట్టి వివరించారు.
ఆస్తి పన్ను రశీదులు కూడా సబ్‌మిట్ చేయాలి
రుణ దాతలు తమ దరఖాస్తుదారుడి తండ్రి ఆస్తి టైటిల్ డీడ్ లేదా సేల్ డీడ్, మ్యుటేషన్ రికార్డులు సబ్మిట్ చేయమని అడుగుతారు. ప్రత్యేకించి సదరు ఆస్తి యాజమాన్యం హక్కును ధ్రువీకరించుకునేందుకు ఆస్తిపై ఆదాయం పన్ను రశీదులు కూడా అందజేయాలని కోరతారు. అలాగే కొడుకు ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్స్, ఇప్పటికే కడుతున్న రుణ వాయిదాల వివరాలను అందజేయాలని సూచిస్తారు.
తండ్రి చనిపోతే వారసత్వ రుజువు కోసం అదనపు పత్రాలివ్వాలి
ఒకవేళ తండ్రి మరణిస్తే.. ఆయన వారసత్వ ఆస్తి అని తెలిపేందుకు అదనపు సర్టిఫికెట్లు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. వారసత్వ సర్టిఫికెట్‌తోపాటు భవన నిర్మాణ ప్రణాళిక, నిర్మాణ వ్యయం అంచనా తదితర వివరాలన్నీ సబ్ మిట్ చేస్తే గానీ హోంలోన్ అప్రూవల్ కాదు. నిధుల విడుదల దశలోనూ భవన నిర్మాణానికి మునిసిపల్ శాఖ ఆమోదం తప్పనిసరి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి